
సింగరేణి కాలరీస్ సామాజిక బాధ్యతతో చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం గడువును ఈ నెల 12 తేదీ వరకు పొడిగించినట్లు సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.బలరామ్ గురువారం ఒక ప్రకటన ఇందులో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధిస్తే సింగరేణి తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా గత నెల 20వ తేదీన ఈ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6వ తేదీ వరకు గడువు విధించడం జరిగింది. అయితే గడువు పొడగించాల్సిందిగా అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 12 వ తేదీకు పెంచినట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ scclmines.com ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.